వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటన జారీ అయింది. అధికారం చేపడితే మెగా డీఎస్సీ కింద 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. మెగా డీఎస్సీ మాట మార్చి అరకొర పోస్టులతో ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లుగా ఊరిస్తున్న డీఎస్సీ ఉసూరనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో కేవలం 386 పోస్టులు మాత్రమే ఖాళీలున్నాయి. టీటీసీ, బీఈడీ, భాషా పండిత కోర్సులు పూర్తి చేసుకొని అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో డీఎస్సీ కోసం శిక్షణ కూడా తీసుకొన్నారు. సొంతూరుకు దూరంగా ఉంటూ, అద్దె గదుల్లో, వసతి గృహాల్లో ఉంటూ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు. కోచింగ్ కోసం, వసతి గృహాల కోసం రూ.వేలు ఖర్చు చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ‘జాబ్ క్యాలెండర్’ ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలు చేపడతామని వైకాపా ప్రభుత్వం ఎన్నికల నియమావళిలో పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత భావన నెలకొంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకతను తొలగించాలనే ఉద్దేశంతో డీఎస్సీ జారీ చేశారు. అరకొర పోస్టులు భర్తీ చేస్తున్నందున మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎస్జీటీ 107 మాత్రమే..
డీఎస్సీ-2024 ప్రకటనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 386 పోస్టులు ఖాళీలున్నాయని పేర్కొన్నారు. అందులో ఎస్జీటీ 107, స్కూల్ అసిస్టెంట్ 164, టీజీటీ 115 పోస్టులున్నాయి. గతంలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేసేవారు. ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ, రెసిడెన్సియల్ పాఠశాలల్లోని బోధన ఉద్యోగాలకు ప్రత్యేక ప్రకటన జారీ చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం బోధన ఉద్యోగాలన్నీ డీఎస్సీలోనే ప్రకటించారు. పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు రీజియన్ స్థాయిలో భర్తీ చేస్తారు. అందుకోసం పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు జిల్లా వారీగా ఖాళీలు చూపకుండా రాష్ట్రవ్యాప్తంగా 215 పీజీటీలు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. టీజీటీ పోస్టులు రీజియన్‌స్థాయి అయినా జిల్లాస్థాయిలో ఖాళీలు వెల్లడించారు. అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
source : eenadu.net
Discussion about this post