కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్‌ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో తప్పులు చేసి, మేం సిద్ధం అంటూ వస్తున్నారని.. అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
సీఎం జగన్‌కు అధికారం నెత్తినెక్కి.. అహంకారంతో విర్రవీగుతున్నారని.. దోపిడీ, విధ్వంసంతో ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలన్నది ఆయన మనస్తత్వమని విమర్శించారు. ‘ఆయన ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండాలి.. మిగిలిన అందరూ ఆయనకు ఊడిగం చేయాలి.. ఆయనది లెక్కలేని మనస్తత్వం. పెత్తందారీ స్వభావం. అయిదేళ్ల జగన్‌రెడ్డిది ఆటవిక పాలన. జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. ఆయన విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వ్యక్తిని ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు. నిన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి మళ్లీ మీ నెత్తిన చేయిపెట్టడానికి రోడ్డు మీదికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి.’ అని హెచ్చరించారు.
మాదిగ వర్గీకరణకు ఎన్‌డీఏ కూడా సానుకూలంగా ఉందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మాదాసి కురుబలను ఎస్సీల్లో చేరుస్తామని, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశం తప్పకుండా పరిశీలిస్తామన్నారు. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. అనంతపురం పార్లమెంటు టికెట్ బోయకు, కర్నూలు, హిందూపురం పార్లమెంటు టెకెట్లను కురుబలకు ఇచ్చామని, నాలుగు అసెంబ్లీ టికెట్లను బోయలకు ఇచ్చామని గుర్తుచేశారు. కూటమి తరఫున ఆదోనిలో పార్థసారథి, మంత్రాలయం టికెట్ రాఘవేంద్రరెడ్డికి, రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులకు, గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం చేయడం కోసమే ఆయా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో సర్పంచులు తిరుగుబాటు చేయాలని ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ‘సర్పంచులకు నిధులు, విధులు కేటాయిస్తా. పనులన్నీ వారితో చేయిస్తాం. గ్రామాల్లో పెత్తనమంతా సర్పంచులది, స్థానిక సంస్థలదే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఏ పార్టీ సర్పంచైనా తెదేపాకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు సర్పంచులు తెదేపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి శవ రాజకీయాలు చేసే వ్యక్తని.. మొన్నటివరకు కోడికత్తి డ్రామా ఆడి ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఎవరైనా గులకరాయితో హత్యాయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. కన్నతల్లికి భారమైన వ్యక్తి జన్మభూమికి కూడా భారమేనని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరమా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి చేసే, పెట్టుబడులు తెచ్చే, ఉద్యోగాలిచ్చే, సుపరిపాలన చేసే సత్తా ఎవరికి ఉందని ప్రశ్నించగా, సభకు వచ్చిన వారందరూ ‘మీకే.. మీకే..’ అంటూ చంద్రబాబునాయుడుకు మద్దతు పలికారు. తెదేపా సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. వైకాపాది పోయే ప్రభుత్వమని.. వారిని నమ్ముకుని వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని, ఒత్తిడి తెస్తే ఎదురు తిరగాలని పేర్కొన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్రగౌడ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు సామాన్య తెదేపా కార్యకర్తలని, వారిద్దరినీ గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నాగరాజు ప్రస్తుతం ఎంపీటీసీగా పనిచేస్తున్నారని, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చామని గుర్తుచేశారు.
అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అవసరం కోసం మొసలి కన్నీరు కార్చడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? పవన్ కల్యాణ్‌ను ఇష్టానుసారంగా తిడుతున్నారు. నా మీద నోరు పారేసుకుంటున్నారు. బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పని. కానీ అభివృద్ధి చేయడం కష్టం.. కూల్చడం ఎంతసేపు? అకారణంగా ప్రజావేదికను కూల్చేశారు. జగన్ విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు. అమరావతిని నాశనం చేశారు’ అని విమర్శించారు. ‘మందుబాబుల బలహీనతే జగన్ బలం. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ. 200 పలుకుతోంది. అయిదేళ్లలో రూ. లక్షల కోట్లు దోచుకున్నారు.పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ధరలు పెంచి, పన్నులు వేసి, మీ డబ్బులు కొట్టేసి, మీ రక్తాన్ని తాగేసిన జలగ ఈ జగన్‌మోహన్‌రెడ్డి’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
source : eenadu.net
Discussion about this post