నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్‌ను చంపేశారు. మాస్కు పెట్టుకోలేదని ఒంగోలులో విక్రం అనే యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నారు. చీరాలలో ఇసుక ట్రాక్టర్‌లో శవం వచ్చింది. గత ఐదేళ్లలో వైకాపా వారు దళితులపై సాగించిన దాడులు అన్నీఇన్నీ కావు. 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. చివరకు అంబేడ్కర్ విద్యాదీవెన పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన ఈ ఉన్మాద సీఎంకు ఏ దళితుడైనా ఓటేస్తారా?’’
రైతు ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్లలో అయిదు సార్లయినా పొలాల్లో తిరిగినట్లు నిరూపిస్తారా, ఆయనకు వ్యవసాయం గురించి తెలుసా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘మిగ్‌జాం తుపానుతో రైతులు పంట నష్టపోతే నేను పరామర్శకు వెళ్లేదాకా జగన్‌లో చలనమే రాలేదు. నేనొస్తున్నానని హడావిడిగా బాపట్లలో హైవే పక్కన రెడ్‌కార్పెట్ వేయించుకుని రైతులను దూరం నుంచి పలకరించారు. ఓట్ల కోసం రైతులను ముద్దులు పెట్టుకొని, గెలిచాక పిడిగుద్దులు గుద్దుతున్నార’ని మండిపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు, రేపల్లెలో శుక్రవారం ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు షోల్లో పాల్గొని, అనంతరం ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్, వేమూరు, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థులు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌లను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నేనానాడు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టాను. నెల రోజుల ముందే రైతులు సాగు చేసుకుని తుపాన్ల కంటే ముందుగానే పంటలు పండించుకున్నారు. నాపై కోపంతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, డెల్టా రైతులను ఇబ్బందుల పాల్జేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే ఉమ్మడి గుంటూరులో మూడో పంటకూ నీరివ్వొచ్చు. కానీ జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. ఓ ఏడాది కరవు, మరో ఏడాది తుపాను వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాల కన్నా జగన్ అసమర్థ పాలన వల్లే ఎక్కువ నష్టం వాటిల్లింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోగా, కొన్నవాటికీ డబ్బులు ఇవ్వలేదు. ధాన్యాన్ని స్థానికంగా కొనుగోలు చేయకుండా, మంగళగిరి, విజయవాడ మిల్లులకు తరలించి అమ్ముకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఎన్నికల వేళ రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. సంక్షేమ పాలన కావాలో, సంక్షోభ పాలన కావాలో రైతులే నిర్ణయించుకోవాలి. జగన్‌కు నిర్మించడం చేతకాదు, కానీ విధ్వంసమే తెలుసు. ప్రజావేదిక కూల్చివేత సహా జగన్ సభలకు వస్తుంటే రోడ్లను ధ్వంసం చేయడం, చెట్లు నరకడం ఈ అయిదేళ్లలో ఎన్నో చూశాం. పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగినట్లు జగన్ తనకు ఓట్లేసిన వారినే పన్నులతో బాదుతున్నారు. ప్రజలు ఇవన్నీ గుర్తెరిగి విజ్ఞతతో ఓటేయాలి. సకాలంలో డీఏలు, ఇంక్రిమెంట్లు రాక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడమే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని దించాలనే అభిప్రాయానికి జనం వచ్చారు. నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని మే 13న దించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపాలో రౌడీలున్నారు. కొందరు మంచివారూ ఉన్నారు. రాష్ట్రం కోసం ఆలోచించే వారికి తెదేపా స్వాగతం పలుకుతుంది. ఈ రోజు సీఎం కూడా గుంటూరులోనే ఉన్నారు. వాళ్లు ఒక్కో సభకు రూ.20 కోట్లు ఖర్చుపెట్టి మద్యం, బిర్యానీ ఇస్తూ, 1,500 బస్సుల్లో జనాల్ని తరలించారు. కానీ మా సభలకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్‌తో నిర్వహించిన సభలకు పోటెత్తారు. ఐదేళ్లలో జగన్ ప్రజలకు కాదు కదా, కనీసం మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పేదల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
తెదేపా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తాం. వీటితో పాటు మరో నాలుగు పాయింట్లను కలపాలని పవన్ కల్యాణ్ సూచించగా, ఒప్పుకొన్నాం. తెదేపా సూపర్ సిక్స్ పథకాలకు, వైకాపా నవరత్నాలకు తేడా తెలుసుకోవాలి. బీసీలకు ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు వెచ్చిస్తాం. ఓట్లు అడగటానికి వచ్చే వైకాపా నేతల్ని కరెంటు బిల్లులు చూపించి నిగ్గదీయాలి. మాది మహిళా పక్షపాత పార్టీ. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ. వారికి అన్నివిధాలా అండగా ఉంటా. సీఎం స్వయంగా వాలంటీర్లను రాజీనామా చేయాలనడం సిగ్గుచేటు. అలా చేసి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. మీకు అండగా మేముంటాం.
జగన్ టికెట్లు ఇచ్చిన వాళ్లలో జేబు దొంగలు, భూకబ్జాదారులు, ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లు, నమ్మక ద్రోహులే ఉన్నారు. రాజధానిలో రోడ్లు తవ్వి, కంకర దొంగిలించిన వ్యక్తి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయనకు పోటీగా నిజాయతీగా పనిచేసి, అక్రమార్కుల ఆటకట్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ఉన్నారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. తన సోదరిని వేధించాడని వైకాపా కార్యకర్తను ప్రశ్నించిన పాపానికి బీసీ విద్యార్థి ఉప్పాల అమరనాథ్‌గౌడ్‌ను దారుణంగా చంపినా, ఆ నిందితుడికి సరైన శిక్ష వేయలేదు. తెదేపా పాలనలో అయితే కఠిన శిక్ష పడేది. సీఎంకు సిగ్గుంటే ఉప్పాలవారిపాలెం వెళ్లి అమరనాథ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించాలి.
source : eenadu.net
Discussion about this post