గుంతకల్లు నియోజకవర్గ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎందుకు కడుపుమంటతో రగిలిపోతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున డీఎంఎం రైల్వే గేటు వద్ద జఠిలంగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రెండున్నరేళ్లు రైల్వే ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి ఆర్‌యూబీ (రైల్ అండర్ బ్రిడ్జి)ని సాధించానన్నారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. బ్రిడ్జి ఎత్తైనా పెంచాలి, లేకుంటే ఫ్లై ఓవరైనా నిర్మించాలంటూ పనులను అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. రైల్వే, మున్సిపల్ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారన్నారు. అయినా, విపక్ష నాయకులు పెద్ద ఇంజినీర్లు అయినట్లు బిల్డప్ ఇస్తూ అరకొర జ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో నవ్వులపాలవుతున్నారన్నారు. బ్రిడ్జి సాధించడంలో ఎమ్మెల్యే గొప్పతనం లేదని, ఎల్‌సీ గేట్ల మూసివేతలో భాగమేనని చెప్పుకోవడం టీడీపీ, సీపీఐ నేతల నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. గతంలో టీడీపీ నేతలు బ్రిడ్జిని ఎందుకు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. కసాపురం రోడ్డు రైల్వే బ్రిడ్జి కూడా 4.6 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో పనులు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో బ్లడ్‌బ్యాంక్, ఆర్‌డీఓ ఆఫీసు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హంద్రీనీవా నుంచి పిల్లకాల్వల తవ్వకానికి రూ.42 కోట్ల మంజూరు, ముస్లిం ఖబరస్తాన్‌కు రూ.6 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం, గుంతకల్లు పోలీస్ సబ్ డివిజన్‌లోకి గుత్తి, పామిడి పీఎస్‌ల విలీనం, గుత్తి వాటర్‌గ్రిడ్, పామిడిలో నీటి సమస్య పరిష్కారం, నియోజకవర్గంలో వందలాది కిలోమీటర్ల రోడ్లు, డ్రైనేజీలు, ఆస్పత్రులు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఆర్‌బీకేలు, జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు, సచివాలయాల నిర్మాణాలు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గర్వంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని, చేతకాకపోతే ఊరికే కూర్చోవాలని హితవు పలికారు. అన్నిటికీ అడ్డు తగులుతూ మజ్జిగలో ఈగ పడేసే చందాన వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలేనని, ఎన్నికల కోసం తెలంగాణ నుంచి వలస వచ్చిన ప్రతిపక్ష నేతలంతా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post