‘మా ప్రభుత్వం గత అయిదేళ్లలో రోడ్లకు రూ.2,626 కోట్లు, జిల్లా రోడ్లకు రూ.1,955 కోట్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు రూ.272 కోట్లు ఖర్చు చేసింది’ ఇవీ.. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చెప్పిన గొప్పలు. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, ప్రజలపై పన్నుల భారం వేసి నిర్మించిన అరొకర రోడ్లే ఆర్థికమంత్రి చెప్పినవాటిల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో 45 వేల కి.మీ. రహదారులు ఉండగా, వీటిలో ఏటా సగటున 9 వేల కి.మీ. రెన్యువల్ చేయాల్సి ఉంది. కానీ ఒక్క ఏడాది మాత్రమే రూ.2,205 కోట్లతో ఈ పనులు చేశారు. దీనికి రూ.2 వేల కోట్లను బ్యాంక్ నుంచి రుణంగా తీసుకున్నారు. ఈ రుణ వాయిదాలు చెల్లించేందుకు వాహనదారులపై పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున రహదారి అభివృద్ధి సెస్ విధించారు. ఈ రూపంలో నెలకు రూ.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.600 కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
వేడుకుంటున్న గుత్తేదారులు
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ప్రాజెక్ట్ కింద రూ.3,104 కోట్లతో 1,243 కి.మీ. అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రసంగంలో చెప్పారు. 2021 మార్చిలో ఈ పనులకు ఒప్పందం జరిగితే ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. బ్యాంక్ అడ్వాన్స్‌గా రూ.130 కోట్లు ఇస్తే వాటిలో గుత్తేదారులకు పలు దఫాలుగా ప్రభుత్వం చెల్లించినది కేవలం రూ.110 కోట్లే. మిగిలిన సొమ్ము ఇవ్వలేదు. దీనికి రాష్ట్ర వాటా రూ.70 కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ ఊసు లేదు. ప్రభుత్వ తీరు చూసి గుత్తేదారులు పనులు చేయడం ఆపేశారు. కొన్ని జిల్లాల్లో గుత్తేదారులైతే తమను ఒప్పందం నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.
నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (నిడా) మొదటి దశ కింద రూ.1,158 కోట్లతో 230 రోడ్లు పూర్తిచేసినట్లు చెప్పారు. ఇదంతా నాబార్డ్ నుంచి తీసుకున్న రుణమే. సేతు బంధన్, ఇతర గ్రాంట్ల కింద రూ.992 కోట్లతో 19 ఆర్వోబీలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పగా.. సేతు బంధన్ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందినది కావడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post