రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న ఆరు లోక్‌సభ స్థానాలకు అదివారం అభ్యర్థుల్ని ప్రకటించింది. జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా, టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. నరసాపురం నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరూ ఊహించని విధంగా టికెట్లు దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం టికెట్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి, అరకు- మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు దక్కాయి. ఈ ఆరుగురిలో శ్రీనివాసవర్మ తప్ప మిగతా అయిదుగురూ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు. భాజపా టికెట్ దక్కినవారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎంపీలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడొకరు ఉన్నారు. భాజపా నుంచి లోక్‌సభ టికెట్లు ఆశించి నిరాశ చెందినవారిలో మాజీ ఎంపీ సుజనాచౌదరి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు ఉన్నారు.
పొత్తులో భాగంగా తెదేపా, జనసేన, భాజపాల మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి భాజపా, రాజంపేట నుంచి తెదేపా పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి, విజయనగరం తెదేపా తీసుకోవాలని భాజపా ప్రతిపాదించింది. దానికి తెదేపా సమ్మతించింది. పొత్తు చర్చలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు రాజంపేటకు కిరణ్ పేరు ప్రచారంలోకి వచ్చినా, ఆ సీటు తెదేపాకి వెళ్లడంతో ఇక ఆయనకు టికెట్ లేదని అందరూ భావించారు. అనంతరం రెండు పార్టీల మధ్య జరిగిన సంప్రదింపుల్లో సీట్లు మార్చుకునేందుకు అంగీకారం కుదరడంతో కిరణ్‌కు మార్గం సుగమమైంది. నరసాపురం లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచీ పరిశీలనలో ఉంది. తెదేపా, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే ఉంది. రెండు మూడు రోజుల నుంచే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని, శ్రీనివాసవర్మకు ఇస్తున్నారని సూచనలు వచ్చాయి. ఇది పూర్తిగా అనూహ్యం. దీనిపై నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.
పార్టీలోకి వచ్చిన రోజే టికెట్
తిరుపతి లోక్‌సభ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆదివారమే భాజపాలో చేరారు. పార్టీలో చేరినరోజే ఆయన అనూహ్యంగా తిరుపతి లోక్‌సభ టికెట్ దక్కించుకున్నారు. ఆయన తమిళనాడు క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2009లో ప్రజారాజ్యం తరఫున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైకాపాలో చేరి 2014లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు వైకాపా టికెట్ ఇచ్చే అవకాశాల్లేవని తెలిసిపోవడంతో… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. చివరకు అనూహ్యంగా భాజపాలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభతోపాటు, మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా ఈ స్థానాన్ని ఆశించారు.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 2009 మధ్య నాలుగుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గానూ, ప్రభుత్వ చీఫ్‌విప్‌గానూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి… జైసమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చాలాకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన… మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు.
నరసాపురం టికెట్ ద]క్కించుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ 2009లో నరసాపురం లోక్‌సభస్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేశారు. మూడున్నర దశాబ్దాలుగా భాజపాలో పలు పదవులు నిర్వర్తించారు. విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు.
ఊహించినట్టుగానే వారికి టికెట్లు!
పురందేశ్వరి, కొత్తపల్లి గీత, సీఎం రమేశ్‌లకు టికెట్లు వస్తాయన్నది అందరూ ఊహించిందే. పురందేశ్వరి 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరారు. 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భాజపాలో జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
తెదేపా తరఫున సీఎం రమేశ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన భాజపాలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన రెండో దఫా పదవీ కాలం వచ్చే నెల మూడో తేదీతో ముగుస్తోంది. భాజపా అధికారికంగా ప్రకటించకముందే… అనకాపల్లి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కొత్తపల్లి గీత గతంలో వైకాపా అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు. ఇప్పుడు అరకు టికెట్ దక్కించుకున్నారు.
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాటిలో కొన్ని స్థానాలకు అభ్యర్థులుగా కొందరి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి పేరును విజయవాడ పశ్చిమ స్థానానికి పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్లకు నడికుదిటి ఈశ్వరరావు, విశాఖ ఉత్తరం స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అనపర్తికి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కైకలూరుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ధర్మవరానికి భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్/ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బద్వేలుకు రోహన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటితోపాటు పాడేరు, ఆదోనిల్లో భాజపా పోటీ చేస్తోంది. ఆదోనికి పార్థా డెంటల్ ఆసుపత్రి యజమాని పార్థసారథి పేరు ప్రచారంలో ఉంది.
source : eenadu.net
Discussion about this post