ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. అలాంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటిస్తూ.. అధికారులు అడ్డుకుంటే ప్రభుత్వంపై నెపాన్ని నెడుతూ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన నాలుగో రోజు మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సాగడంతో ఎన్నికల అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు.
పవన్ తొలుత పిఠాపురం ఏబీసీ చర్చిలో ప్రార్థనలకు వచ్చారు. ఆ చర్చి పాస్టర్లు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో మొక్కుబడిగా ప్రార్థనలు పూర్తిచేసుకున్న పవన్ అక్కడి నుంచి కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు బషీర్‌బీబీ దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం రోడ్డు షోగా బయలుదేరి యు.కొత్తపల్పిలోని ఒక ఫంక్షన్ హాలులో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.
ఇంతలోనే అక్కడికి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని సమావేశం నిర్వహణకు అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దీంతో జనసేన నేతలు నీళ్లు నమిలారు. అధికారులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక త్వరలోనే మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుంచి పవన్ వెళ్లిపోయారు.
source : sakshi.com
Discussion about this post