ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. గురువారం చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలకు పార్టీ శ్రేణులు పోటెత్తాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అధినేత మాటలు వినేందుకు వేలాదిగా తరలివచ్చారు. చంద్రబాబు చెప్పే ప్రతి మాటకు స్పందిస్తూ.. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినదించారు. తమ్ముళ్ల ఉత్సాహం చూసి చంద్రబాబు తన ప్రసంగానికి మరింత ధాటిగా కొనసాగించారు. ‘‘తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడైంది. దీంతో పోట్లగిత్తల్లా ఉరకలేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మీకిచ్చిన ధైర్యం. దీనికి తిరుగుండదు. ఎదురుండదు. అడ్డమొస్తే తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిపే సమస్యే ఉండదు’’ అంటూ చంద్రబాబు శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన పరిటాల రవీంద్రను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నికల్లో పోరాడాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: సునీత
మా కుటుంబానికి ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాప్తాడు అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించి ఆదుకున్నారు. పేరూరు ప్రాజెక్టుకు రూ.804 కోట్లు మంజూరు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తిగా పక్కకు పెట్టేశారు. కనీసం రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. తెదేపా అధికారంలోకి రాగానే రైతుల్ని ఆదుకుంటాం. రాప్తాడులో లక్ష ఎకరాలకు నీరు ఇస్తానని.. లేని పక్షంలో మీసం తీయించుకుంటానని ఆరోజు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సవాల్ చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. కమీషన్ల కోసం జాకీ పరిశ్రమను తరిమేశారు. రాక్రీటు సంస్థ ద్వారా ఇళ్ల కాంట్రాక్టు తీసుకుని రూ.200 కోట్లు అక్రమాలు చేశారు.
ప్రతి ఎకరాకు నీరు
జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, కియా మోటర్స్ కోసం గొల్లపల్లి జలాశయాలు పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చుపెట్టాం. ఐదేళ్ల పాలనలో జగన్ ఒక ఎకరాకు నీరిచ్చారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం ఇచ్చాడా. అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాగానే అభివృద్ధిని మళ్లీ ట్రాక్‌లో పెడతాం. ప్రతి ఎకరాకు నీరందిస్తామని స్పష్టం చేశారు.
ఒక్కహామీ నెరవేర్చని జగన్
‘ఎన్నికల ముందు జగన్ జిల్లాకు అనేక హామీలు ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్కటీ నెరవేర్చలేదు. ఉల్లికల్లు, చాగల్లు ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.168 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మిడ్‌పెన్నార్ నిర్వహణకు రూ.3 కోట్లు, గండికోట, పుట్లూరు మండలాలకు వాటర్ పైప్‌లైన్ కోసం రూ.250 కోట్లు, కోల్డ్ స్టోరేజ్‌కు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తానని ఇవ్వలేదు. శింగనమల ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త కలిసి ప్రభుత్వ భూములు, వివాద భూములు 500 ఎకరాలు కొట్టేశారు. తెదేపా అధికారంలోకొస్తే నిలిచిపోయిన సెంట్రల్ యూనివర్సిటీ పనులను పూర్తిచేస్తాం. హంద్రీనీవా ద్వారా ఎన్పీకుంట, గాండ్లపెంటకు నీరిస్తాం. కదిరి ప్రాంతంలో వలసలు నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు, ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తాం. కదిరి-రాయచోటి నిర్మాణం పూర్తి చేస్తాం. వడ్డెర్లను భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం.’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.



source : eenadu.net
Discussion about this post