సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ , తెలుగుదేశం , జనసేన ,బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించాక.. ‘మేమంతా సిద్ధం’ పేరిట జగన్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. 21 రోజుల పాటు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల గుండా ఈ యాత్ర సాగుతుంది. చంద్రబాబు ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ నెల 17న చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట ఉమ్మడి సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ప్రజాగళం పేరిటే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనుండగా.. పవన్ 30న పిఠాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
నేడు ప్రొద్దుటూరులో జగన్ సభ
సీఎం జగన్ బుధవారం సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో 12.45కు ఇడుపులపాయ వెళ్తారు. మధ్యాహ్నం 1.20 వరకు వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించి 1.30 గంటలకు బస్సులో బయలుదేరి వేంపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు మీదుగా ఆళ్లగడ్డ వెళ్లి రాత్రికి అక్కడ బసచేస్తారు. గురువారం నంద్యాల సభలో పాల్గొంటారు. కాగా.. ప్రొద్దుటూరు సభకు డ్వాక్రా మహిళలను తరలించాలని మెప్మాలో పనిచేస్తున్న సీవోలు, ఆర్పీలు వాట్సాప్ మెసేజ్‌లు పంపించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి, సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను జగనన్న ఆదుకున్నారని.. ఆ రుణం తీర్చుకునేందుకు ఈ సభలో డ్వాక్రా మహిళలు పాల్గొనాలని పేర్కొన్నారు.
రోజుకు 3 నియోజకవర్గాల్లో బాబు పర్యటన
చంద్రబాబు ప్రజాగళం పర్యటనకు బుధవారం శ్రీకారం చుడుతున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకుని అక్కడ ప్రజాగళం తొలి బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత నగరి నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సభల్లోనూ మాట్లాడతారు.
30 నుంచి 3 రోజులు పిఠాపురంలోనే పవన్..
పవన్ 30వ తేదీ నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో మూడ్రోజులు పర్యటిస్తారు. పురూహూతిక అమ్మవారిని దర్శించుకుంటారు. వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. దత్తపీఠాన్ని సందర్శిస్తారు. బంగారుపాప దర్గాకు వెళ్తారు. క్రైస్తవ పెద్దలతో భేటీ అవుతారు.
source : andhrajyothi.com
Discussion about this post