తలుపుల మండలానికి హంద్రీనీవా నీటిని కదిరి వైకాపా సమన్వయకర్త మగ్బూల్ అహమ్మద్ విడుదల చేయడం వైకాపాలో ఆధిపత్య పోరును బయట పెట్టింది. బుధవారం కదిరి మండలం పట్నం సమీపంలో ప్రధాన కాలువ నుంచి హంద్రీనీవా నీటిని తలుపుల మండలానికి అధికారులు, పార్టీ నాయకులతో కలిసి మగ్బూల్ విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెదేపా కదిరి నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ హంద్రీనీవా కాలువ పనులు తెదేపా హయాంలో దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయడానికి వైకాపాకు ఐదేళ్ల కాలం పట్టిందని విమర్శించారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి, వైకాపా సమన్వయకర్త మగ్బూల్ అహమ్మద్‌లు తలుపుల మండలానికి నీటిని విడుదల చేయడానికి సమాయత్తం అయ్యారు. బుధవారం మగ్బూల్ అహమ్మద్ నీటిని విడుదల చేసిన విషయం తెలుసుకున్న సిద్ధారెడ్డి వర్గీయులు కష్టపడింది ఒకరైతే.. ప్రచారం మరొకరికంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సమన్వయకర్తపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే ఉండగా సమన్వయకర్త నీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు.
source : eenadu.net
Discussion about this post