రాష్ట్రంలో ఓట్ల గోల్‌మాల్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కీలకంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో ఆ పార్టీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్య యాదవ్‌తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఓట్ల గల్లంతులో పెద్ద చేపల్ని వదిలి చిన్న చేపలను పట్టుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం ప్రస్తుత ఎస్పీ అన్బురాజన్ కడప జిల్లాలో ఉన్న సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు. మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డి సైతం ఇదే కోవకు చెందినవాడని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కాళ్లకింద తొక్కిపట్టి పబ్బం గడుపుకొంటున్న ఏకైక నియంత జగన్ అని విమర్శించారు.
భాజపాది మైండ్‌గేమ్
‘వైనాట్ 175 అని బీరాలు పలికిన సీఎం జగన్‌కు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను వారి నియోజకవర్గాల నుంచి బదిలీ చేయడం, అభ్యర్థులను మార్చడం, డబ్బున్న వారిని పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీలతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడని విమర్శించారు. ఇందుకోసం భాజపా పక్కా మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. భాజపా బ్లాక్‌మెయిల్ రాజకీయాలను ఎదుర్కొనే క్రమంలో ఈనెల 20న విజయవాడ నగరంలో సీపీఐ, సీపీఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని లౌకిక రాజకీయ పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post