సార్వత్రిక ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమి సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎన్నికల అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవితో కలిసి పోలీసు, వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్, ఆదాయపన్ను శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జిల్లాలోని సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబందించి సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించేందుకు అధికారులతో చర్చించాలన్నారు.
నిఘా పెంచాలి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. సెక్షన్ 123 ఆఫ్ ఆర్‌పీ యాక్ట్, 171బీ, 171సీ యాక్టులు పకడ్బందీగా అమలవ్వాలన్నారు. కర్ణాటక రాష్ట్రం జిల్లాకు సరిహద్దుగా ఉందన్నారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేయాలన్నారు. డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు అక్రమ రవాణా జరగకుండా నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చెక్‌పోస్టుల్లో సీజ్ చేసిన వివరాలు ప్రతి రోజూ నివేదిక రూపంలో అందించాలని చెప్పారు.
నోటిఫికేషన్ తరువాత కమిటీలు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదౖలైన తరువాత ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఏస్‌టీ, వీఎస్‌టీ, తదితర కమిటీలు క్రియాశీలం కావాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు, వాణిజ్య, ఆదాయ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెక్‌పోస్టుల ఏర్పాటుకు చర్యలు
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 24 చెక్‌పోస్టులు, 6 డైనమిక్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రైల్వేస్టేషన్లలో ఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాన్నారు. ఆర్టీసీ అధికారులు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. ఎన్నికల సమయంలో వాణిజ్య, ఆదాయ పన్ను శాఖల పాత్ర కీలకమన్నారు. బ్యాంకుల్లో అధిక డిపాజిట్లు, ఖాతాల్లో నగదు నిల్వ, బంగారు విక్రయ దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ఇలా అన్ని అంశాలపై అధికారులు ప్రత్యేక దృషి సారించాలన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణీ సుస్మిత, శ్రీనివాసులురెడ్డి, ఈఆర్‌ఓలు రాంభూపాల్‌రెడ్డి, కరుణకుమారి, వరప్రసాద్, ఎల్‌డీఎం సత్యరాజ్, డీసీఓ ప్రభాకర్‌రెడ్డి, వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ శేషారెడ్డి, ఆదాయపన్ను శాఖ అధికారి విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ వసంతబాబు, తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post