ఇంటింటికీ పింఛను ఇవ్వొద్దని.. సచివాలయాలకే వృద్ధుల్ని రప్పించాలని చెప్పింది జగన్ ప్రభుత్వమే. అందులో పనిచేసే ఆయన వందిమాగధులైన అధికారులే. వైకాపా ప్రయోజనాల కోసం వారు తీసుకున్న నిర్ణయాల వల్ల 30 మందికి పైగా మరణించినా.. ఇంకా శవ రాజకీయం ఆపలేదు. అధికారం తమ చేతిలో లేని సమయంలో ఇంటింటికీ పింఛను ఆగిందని అసత్యాలు వల్లె వేశారు. ‘ఇంటింటికీ పింఛను ఆగలేదు.. ఆపారు’ అని నిజాన్ని అంగీకరించిన ఆయన… కుట్ర పన్నింది తమ ప్రభుత్వమే అనే విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. సచివాలయాలకు డబ్బు విడుదల చేయకుండా కావాలని జాప్యం చేసింది ఆయన సర్కారే. అక్కడ డబ్బు అందుబాటులో లేదని తెలిసీ.. వృద్ధుల్ని మంచాలపై సచివాలయాలకు తీసుకెళ్లి డ్రామాలాడి వీడియోలు తీసిందీ వైకాపా కార్యకర్తలే. అయినా అనుకున్నంత మైలేజి రాలేదనే అభిప్రాయంలో ఆ పార్టీనేతలు ఉన్నారు. అందుకే సీఎం జగన్ సిద్ధం సభల ప్రసంగాల్లో పదేపదే అవే అబద్ధాలు వల్లె వేస్తున్నారు. ‘ఇంటికి వెళ్లి వాలంటీర్లు పింఛను ఇవ్వకూడదట.. అలా వెళ్లడం నేరమట.. 30 మంది పైచిలుకు అవ్వాతాతల్ని చంపిన హంతకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’ అని మేమంతా సిద్ధం సభలో విమర్శించారు.
జగన్ తన ప్రసంగంలో మళ్లీ ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు తెచ్చారా? అనే ప్రశ్నలు వేశారు. గత ఎన్నికల సమయంలో ఊరూవాడా తిరుగుతూ.. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికారు. గెలిచాక.. తాను మెడలు వంచాననే సంగతి మరచిపోయారేమో? మళ్లీ ప్రత్యేక హోదా అనడానికి ఆయనకు నోరెలా వచ్చింది? ఆ పదం పలికే అర్హత ఆయనకు ఉందా? అని ఆయన ప్రసంగం విన్న పలువురు చర్చించుకున్నారు.
source : eenadu.net
Discussion about this post