పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు.
నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి.
దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం.
ఐఏఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్‌లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం.
source : sakshi.com
Discussion about this post