స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఆయా సభ్యులను వ్యక్తిగతంగా, సమూహంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలకు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగానీ ప్రభావితం చేసేలా సమీకరించడం, అవగాహన, సర్వే వంటి కార్యక్రమాలు నిర్వహించడం చేయకూడదని తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా సెర్ప్ సీఈవో, మెప్మా డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ నెల 18న నోటిఫికేషన్ జారీతో ఆరంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. శాంతియుతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఓటరు కార్డుల పంపిణీ అంశంపై మే 4న కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని, అప్పటికి వీటి పంపిణీ పూర్తికావాలని చెప్పారు. సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తున్నారంటూ జిల్లా ఎన్నికల అధికారులను సీఈవో అభినందించారు. అక్రమంగా సొత్తు తరలింపును నియంత్రించడం, విస్తృత తనిఖీల ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడంలో అనేక జిల్లాల ఎన్నికల అధికారులు ప్రగతి చూపిస్తున్నారని.. కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలు మాత్రం ఇందులో వెనుకబడ్డాయని పేర్కొన్నారు.
పోలింగ్ రోజుగానీ, ముందు రోజుగానీ రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా పత్రికల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రచురించకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
source : eenadu.net
 
	    	 
                                









 
                                    
Discussion about this post