ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్ విమర్శించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనంకి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దుచేసి, పాతపెన్షన విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉపాధ్యాయ, ఉద్యోగులను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. ఐదేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కరించలేదన్నారు. 11వ పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలనీ, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలనీ, పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరయ్యకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
source : andhrajyothi.com










Discussion about this post